క‌శ్మీర్‌పై పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు!

  • కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా ఉండాల‌నుకుంటున్నారా?
  • లేదంటే పాకిస్థాన్‌లో కలిసిపోవాల‌నుకుంటున్నారా?
  • ఈ విష‌యం అక్క‌డి ప్ర‌జ‌ల ఇష్టం
  • భవిష్యత్తును ఐరాస తీర్మానాల ప్రకారం నిర్ణయించుకోవాలి
కశ్మీర్ పై పాకిస్థాన్ నేత‌లు మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆ దేశ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. పీవోకేలోని తరార్ ఖాల్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ... కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా ఉండాల‌నుకుంటున్నారా? లేక పాకిస్థాన్‌లో కలిసిపోవాల‌నుకుంటున్నారా? అనేది అక్కడి ప్ర‌జ‌ల ఇష్ట‌మ‌ని అన్నారు.  

దీనిపై తాము ఎటువంటి బలవంత చ‌ర్య‌ల‌కు దిగబోమని చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ను పాక్‌లో కలిపేయాల‌న్న ప్రయత్నాలు తాము చేయ‌ట్లేద‌ని అన్నారు. పాక్‌ విపక్ష నేతలు ఈ విష‌యంపై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. కశ్మీర్ ప్ర‌జ‌లు తమ భవిష్యత్తును ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం నిర్ణయించుకోవడానికి అనుమతించే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు.

అటువంటి స‌మ‌యం వ‌చ్చాక కశ్మీర్ ప్రజలు పాక్‌లో కలిసిపోవాలని నిర్ణయించుకుంటారని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవ‌ల‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్ నవాజ్ నేత మర్యామ్ నవాజ్ కూడా కశ్మీర్ ‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ ప్రాంతాన్ని త‌మ దేశంలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.


More Telugu News