దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

  • దేశవ్యాప్తంగా భారీ వర్షాలు
  • విరిగిపడిన కొండచరియలు
  • 14 రైళ్లను రద్దు చేసిన రైల్వే
  • ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి నడిచే రైళ్ల రద్దు 
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని ఇగత్‌పరి-లోనావాలా, కొల్హాపూర్-మిరాజ్ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో 14 రైళ్లను రద్దు చేసింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు నాలుగు రైళ్లను ఒక్కో రోజు రద్దు చేయగా, మిగతా పది రైళ్లను నాలుగు రోజుల చొప్పున రద్దు చేశారు.

ఈ నెల 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్-తిరువనంతపురం, చండీగఢ్-కొచ్చువేళి, హిస్సార్-కోయంబత్తూరు రైళ్లతోపాటు, ముంబై-తిరువనంతపురం మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించారు. నిన్న బయల్దేరాల్సిన తిరుపతి-కొల్హాపూర్, 26న బయల్దేరాల్సిన హౌరా-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, ఎర్నాకుళం-హజ్రత్ నిజాముద్దీన్, పోర్‌బందర్-కొచ్చవేళి, కేఎస్ఆర్ బెంగళూరు-అజ్మీర్ రైళ్లను దారి మళ్లించారు.

రద్దయిన రైళ్లలో ఆదిలాబాద్-సీఎస్‌టీ ముంబై (24-27), సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్ (25-28), హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై (24-27), సీఎస్‌టీ ముంబై-హైదరాబాద్ (25-28), సికింద్రాబాద్-ఎల్‌టీటీ ముంబై (27న), ఎల్‌టీటీ ముంబై-సికింద్రాబాద్ (28న) రైళ్లు ఉన్నాయి.


More Telugu News