తొలిరోజే అదరగొట్టిన జొమాటో.. ఐపీవోతో రూ.లక్ష కోట్లు

  • షేర్ వాస్తవ ప్రీమియంపై 50% అదనంగా లిస్టింగ్
  • ఎన్ఎస్ఈలో రూ.116.. బీఎస్ఈలో రూ.115
  • బీఎస్ఈలో టాప్ 50 సంస్థల్లో చోటు
మార్కెట్ లో జొమాటో కొనుగోళ్ల విందు చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజీ (ఎన్ఎస్ఈ)లో 53 శాతం ప్రీమియంతో ఒక్కో షేరు ధర రూ.116గా లిస్ట్ అయింది. అదే బాంబే స్టాక్ ఎక్స్ చేంజీ (బీఎస్ఈ)లో 51 శాతం ప్రీమియంతో రూ.115గా లిస్ట్ లో చేరింది. ఈ కంపెనీ షేర్ వాస్తవ ఐపీవో ధర రూ.76. అయితే, 50 శాతం అదనపు ధరతో లిస్ట్ కావడం విశేషం. 2020 తర్వాత 50 శాతం అదనపు ప్రీమియంతో లిస్ట్ అయిన 10 కంపెనీల జాబితాలో జొమాటో చేరింది.

లిస్ట్ అయిన కొద్దిసేపటికే షేర్ ధర 62 శాతం పెరిగింది. ఒకానొక దశలో రూ.138ని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసినట్టయింది. బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన 50 సంస్థల సరసన చేరింది. ఇంకో విశేషమేంటంటే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలనూ అది దాటేసి ముందుకు పోయింది.

ప్రస్తుతం మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడమూ సంస్థకు కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు ఐపీవో లిస్టింగ్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. లాభాలు మరీ ఏం లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వమే జొమాటో విషయంలో సానుకూల ధోరణికి కారణమై ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం జొమాటో ఆర్డర్లు 23.89 కోట్లకు పెరిగాయి. 525 నగరాల్లో సంస్థ సేవలందిస్తోంది. 3,89,932 రెస్టారెంట్లు జొమాటోలో ఉన్నాయి. 2018లో కేవలం 3.06 కోట్ల ఆర్డర్లే ఉండగా.. మూడేళ్లలోనే 20 కోట్లు దాటేయడం చూస్తే సంస్థ దేశంలో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.


More Telugu News