నేటి నుంచి ఒలింపిక్స్... భారత అథ్లెట్లకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

  • టోక్యో వేదికగా ఒలింపిక్స్
  • తరలి వెళ్లిన భారత అథ్లెట్లు
  • ఆటల సింగిడి అంటూ అభివర్ణించిన తెలంగాణ సీఎం
  • భారత కీర్తిపతాకను ఎగరేయాలని పిలుపు
జపాన్ రాజధాని టోక్యోలో నేటి నుంచి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. భారత్ నుంచి అగ్రశ్రేణి క్రీడాకారుల బృందం ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. టోక్యోలో నేడు ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన చేశారు.

ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్ శాంతిసౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడి (హరివిల్లు)కి ప్రతిరూపంగా నిలుస్తాయని అభివర్ణించారు. ఒలింపిక్స్ లో విజయాలు సాధించి స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

కాగా, నేడు ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8న ముగియనున్నాయి. టోక్యో వేదికగా జరిగే ఈ ప్రపంచ క్రీడోత్సవంలో 206 దేశాల నుంచి 11,324 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. ఓవరాల్ గా 339 ఈవెంట్లలో పతకాల కోసం క్రీడాకారులు బరిలో దిగుతారు. 


More Telugu News