ఆర్థిక కష్టాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సెలవుల ఆఫర్!

  • కరోనా వల్ల దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
  • సెలవు తీసుకునే ఉద్యోగులకు సగం జీతం చెల్లింపు
  • ఏటా రూ. 6 వేల కోట్లు ఆదా అవుతాయని అంచనా
కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో, ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో పోలీస్, విద్య, వైద్యం, రెవెన్యూ విభాగాలు మినహా ఇతర అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సెలవు సమయంలో వారికి సగం జీతం ఇస్తారు. ఖర్చును తగ్గించుకునేందుకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఈ నిర్ణయానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపితే వెంటనే అమల్లోకి వస్తుంది.

మధ్యప్రదేశ్ కు ఇప్పటికే 2.53 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నిరర్థక ఆస్తులను అమ్మి రూ. 500 కోట్లను సమీకరించారు. ఇప్పుడు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతంలో సగం ఆదా అవుతుంది. తద్వారా ఏటా రూ. 6 వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు సెలవు తీసుకునే వెసులుబాటు కల్పించారు.


More Telugu News