టీఆర్ఎస్‌కు సామ వెంకట్‌రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్‌లో చేరిక

  • వెంకట్‌రెడ్డి సహా రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి సభ్యులందరూ రాజీనామా
  • మాణికం ఠాగూర్‌ను కలిసిన నేతలు
  • కేసీఆర్ పాలనలో ఉద్యమకారులు నిరాశలో కూరుకుపోయారన్న రేవంత్
తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి సహా మండలి కార్యవర్గ సభ్యులందరూ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే వారంతా కాంగ్రెస్ గూటికి చేరన్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్‌రెడ్డి నిన్న ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా తాను పనిచేసినట్టు చెప్పారు. తమ సంఘానికి 33 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయని, దాదాపు 40 వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.

రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యమకారులు నిరాశలో కూరుకుపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వెంకట్‌రెడ్డి సహా కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌ను కలిశారని, ముఖ్యనాయకులతో చర్చించిన అనంతరం వారిని పార్టీలో చేర్చుకోనున్నట్టు చెప్పారు.


More Telugu News