కొవిడ్ ఐసీయూ ఖర్చుల కోసం ఏడు నెలల జీతాన్ని ఖర్చు చేస్తున్న భారతీయులు!
- భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్, డ్యూక్ గ్లోబల్ హెల్త్ సంస్థ పరిశోధకుల సంయుక్త అధ్యయనం
- గతేడాది ఏప్రిల్ నుంచి గత నెల వరకు ఏకంగా రూ. 64 వేల కోట్ల ఖర్చు
- 15 నెలల ఆదాయాన్ని ఖర్చు చేస్తున్న దినసరి కూలీలు
దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. దీని బారినపడినవారు ఆసుపత్రుల్లో చేరి లక్షలాది రూపాయలు వదిలించుకుంటున్నారు. ఐసీయూ చికిత్స కోసం సగటు భారతీయుడు ఏకంగా ఏడు నెలల వేతనాన్ని ఖర్చు చేస్తున్నట్టు భారత ప్రజా ఆరోగ్య ఫౌండేషన్, డ్యూక్ గ్లోబల్ హెల్త్ సంస్థ పరిశోధకులు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. అదే దినసరి కూలీలు అయితే 15 నెలల ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. కొవిడ్ పరీక్షలు, చికిత్సల కోసం గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు భారతీయులు ఏకంగా రూ. 64 వేల కోట్లను ఖర్చు చేసినట్టు అధ్యయనం వివరించింది.