నేను రాజీనామా చేసిన తర్వాత కొత్త పథకాలు వస్తున్నాయి: ఈటల రాజేందర్

  • దళితులను కేసీఆర్ మోసం చేశారు
  • సీఎం కార్యాలయంలో ఒక్క దళిత అధికారి కూడా లేరు
  • నా పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడ కరెంట్ తీసేస్తున్నారు
టీఆర్ఎస్ కు తాను రాజీనామా చేసిన తర్వాతే హుజూరాబాద్ కు కొత్త పథకాలు వస్తున్నాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. అయితే, హూజూరాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలోని అందరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పిన కేసీఆర్... సీఎం అయిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. దళితులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు.

సీఎం కార్యాలయంలో ఒక్క దళిత అధికారి కూడా లేరని ఈటల చెప్పారు. రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లాక్కున్నారని తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికీ రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్ర ఎక్కడ కొనసాగుతుంటే అక్కడ కరెంట్ తీసేస్తున్నారని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నీచంగా వ్యవహరిస్తోందో ప్రజలు గమనించాలని అన్నారు. అధికార పార్టీ అహంకారాన్ని ఓడగొట్టే శక్తి హుజూరాబాద్ ప్రజలకు మాత్రమే ఉందని చెప్పారు. ఇన్నేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఒక్క తప్పు కూడా చేయలేదని అన్నారు.


More Telugu News