భారత్‌ను గెలిపించిన చాహర్.. సిరీస్ సొంతం

  • చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించిన చాహర్
  • అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్
  • మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో జయభేరి మోగించిన భారత కుర్రాళ్ల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దీపక్ చాహర్ చివర్లో అద్భుత పోరాట పటిమతో చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి జేజేలు అందుకున్నాడు. 82 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 69 పరుగులు చేసి సిరీస్ విజయాన్ని అందించాడు.

శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి వన్డే హీరోలు పృథ్వీషా (13) ఇషాన్ కిషన్ (1) ఈసారి విఫలమయ్యారు. కెప్టెన్ శిఖర్ ధవన్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మనీష్ పాండే (37), సూర్యకుమార్ యాదవ్ (53), కృనాల్ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

అయితే, వీరు అవుటయ్యాక భారత ఓటమి ఖాయమనుకున్న వేళ క్రీజులో పాతుకుపోయిన చాహర్.. భువనేశ్వర్ (19 నాటౌట్)తో కలిసి  జట్టును విజయపథాన నడిపించాడు. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి, 49.1 ఓవర్లలో చేరుకొని, విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. శ్రీలంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీసుకోగా, రజిత, లక్షణ్ శందాకన్, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక గత వన్డే కంటే ఎక్కువ పరుగులే చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంక (65) అర్ధ సెంచరీలతో రాణించారు. భానుక 36, ధనంజయ డి సిల్వా 32, చివర్లో కరుణ రత్నె 44 పరుగులతో రాణించడంతో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్, భువనేశ్వర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నాడు. నామమాత్రంగా మూడో వన్డే ఈ నెల 23న జరుగుతుంది.


More Telugu News