దేశంలో ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్ కథనాలపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి

  • ఓ వెబ్ పోర్టల్ లో సంచలన కథనం
  • పెగాసస్ స్పై వేర్ చొప్పించి హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు
  • ఇవన్నీ నిరాధారమన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • భారత ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకని విమర్శలు
దేశంలో అనేక మంది ప్రముఖుల ఫోన్లను పెగాసస్ స్పై వేర్ సాయంతో హ్యాకింగ్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. ఇవాళ లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, గతంలోనూ ఇలాంటివి వినిపించాయని అన్నారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేశారు.

ఫోన్ హ్యాకింగ్ పై ఓ వెబ్ పోర్టల్ లో సంచలన కథనం వచ్చిందని అన్నారు. అయితే, సరిగ్గా లోక్ సభ సమావేశాల ప్రారంభానికి ముందే ఇలాంటి కథనాలు రావడాన్ని తాము కాకతాళీయం అని భావించడంలేదని, ఉద్దేశపూర్వకంగానే ఈ కథనాలు తీసుకువచ్చారని నమ్ముతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయని, భారత ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకే ఈ కథనాలు రూపొందిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందు సంచలన కథనం రావడం వెనుక ఆంతర్యం ఏమిటో గ్రహించాలని పేర్కొన్నారు.


More Telugu News