నిరుద్యోగులను దగా చేశారు: వైసీపీ సర్కారుపై పవన్ ఆగ్రహం

  • రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నిరుద్యోగుల ఆందోళనలు
  • పవన్ వీడియో సందేశం
  • జనసేన అండగా నిలుస్తుందని ప్రకటన
  • రేపు అధికారులకు వినతి పత్రాల అందజేత
రాష్ట్రంలో నిరుద్యోగంపై విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళనలను తీవ్రతరం చేసిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులను దగా చేశారని, వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు దండగ పదవులు ఇచ్చారని విమర్శించారు.

"నిరుద్యోగులు ఇవాళ ఒకటే మాట అడుగుతున్నారు.... వైసీపీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు కూడా సృష్టించి ఉపాధి కల్పించినప్పుడు, మీరిచ్చిన మాట ప్రకారం 2.30 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయరు? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ రాజకీయ నిరుద్యోగులపై చూపినంత ఉత్సాహం, చొరవ తమపై ఎందుకు చూపరని వారు నిలదీస్తున్నారు. దీనికి వైసీపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?  మీ పార్టీ అధికారంలోకి రావడానికి లక్షలాది మంది నిరుద్యోగులం అండగా నిలిచామని, కానీ ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు" అని వివరించారు.

"ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఒకే ఒక్క మాట చెబుతున్నాం... వారికి జనసేన సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. దీనిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ, పార్టీ నేతలతోనూ చర్చించాం. రేపు మంగళవారం జిల్లాల్లోని అన్ని ఎంప్లాయిమెంట్ ఎక్చేంజిలకు వెళ్లి నిరుద్యోగుల తరఫున వినతిపత్రాలు ఇవ్వాలని జనసేన నాయకులు, జనసైనికులకు సూచించాం" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం అందించారు.


More Telugu News