ఓటీటీ రిలీజ్ అనగానే చాలా బాధపడ్డాను: 'నారప్ప' డైరెక్టర్!

  • 'నారప్ప' కోసం ఎంతో కష్టపడ్డాను
  • పెద్దగా మార్పులు చేయలేదు
  • రెండు రోజులు నిద్రపట్టలేదు
  • పరిస్థితులు అర్థం చేసుకున్నాను
కుటుంబ నేపథ్యంతో కూడిన కథలను తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాల సిద్ధహస్తుడు. 'బ్రహ్మోత్సవం' పరాజయం కారణంగా కాస్త వెనకబడిన ఆయన, ఆ తరువాత 'నారప్ప' అవకాశాన్ని దక్కించుకున్నాడు. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్'కు ఇది రీమేక్. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి శ్రీకాంత్ అడ్డాల మాట్లాడాడు.

'నారప్ప' యాక్షన్ మూవీ అని చాలామంది అనుకుంటారు .. కానీ ఆ యాక్షన్ అంతా కూడా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. నేటివిటీకి తగినట్టుగా చిన్నచిన్న మార్పులను మాత్రమే చేశాను. ఒరిజనల్లో ఉన్న సున్నితమైన భావోద్వేగాలను ఎంతమాత్రం కదిలించే ప్రయత్నాలు చేయలేదు. ఈ సినిమాను ఒక ఛాలెంజింగ్ గా భావించి చేశాను. 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. ఒక భారీ సినిమాకు ఎంతలా కష్టపడతామో, ఈ సినిమాకి ఆ విధంగానే కష్టపడ్డాను. ఈ సినిమా ఓటీటీకి వెళుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ విషయం తెలిసిన తరువాత నాకు చాలా బాధకలిగింది .. రెండు రోజుల పాటు నిద్రపట్టలేదు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను" అని అన్నాడు.


More Telugu News