కరోనా అవశేషాలు ఉన్నాయంటూ భారత్ నుంచి రొయ్యల దిగుమతి నిలిపివేసిన చైనా

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి
  • రొయ్యల కంటైనర్లపై చైనా నిషేధం
  • తీవ్ర నష్టాల ముంగిట 60 భారత సంస్థలు 
  • భారత్ కు ప్రధాన మార్కెట్లలో చైనాకు రెండో స్థానం
  • పెద్ద రొయ్యలకు చైనాలో గిరాకీ
భారత్ లో సాగు అయ్యే రొయ్యలను అత్యధిక మొత్తంలో దిగుమతి చేసుకునే దేశం అమెరికా అయితే, ఆ తర్వాత స్థానంలో చైనా ఉంటుంది. అయితే, కరోనా నేపథ్యంలో భారత్ నుంచి రొయ్యల దిగుమతులపై చైనా నిషేధం విధించింది. రొయ్యల ప్యాకింగ్ లపై కరోనా అవశేషాలు ఉన్నాయంటూ చైనా స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో భారత్ కు చెందిన 60 రొయ్యల ఎగుమతి కంపెనీలు తీవ్రంగా నష్టపోనున్నాయి. ఆ కంపెనీల్లో 20 ఏపీకి చెందినవే. ఏపీలో అధికంగా సాగు అయ్యే వనామీ రొయ్యలకు ప్రధాన మార్కెట్ చైనానే. పెద్ద సైజు రొయ్యలకు చైనాలో విపరీతమైన గిరాకీ ఉంటుంది.

కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్నందున, చైనా రొయ్యల కంటైనర్లను నిశితంగా పరీక్షిస్తోంది. రొయ్యల ప్యాకింగ్ లపై కరోనా క్రిములు ఉన్నాయని, వీటిని తాము అనుమతించలేమని చైనా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చైనా నిర్ణయంతో రూ.1000 కోట్ల విలువైన రొయ్యలు భారత్ లోనే నిలిచిపోనున్నాయి.

కాగా, చైనా వాదనలను భారత రొయ్యల ఎగుమతిదారులు అంగీకరించడం లేదు. రొయ్యలతో కూడిన కంటైనర్లు భారత్ నుంచి చైనా చేరుకోవడానికి సముద్రమార్గంలో 25 రోజుల సమయం పడుతుందని, అన్ని రోజుల పాటు కరోనా అవశేషాలు ఎలా ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు. అది కూడా రొయ్యలను ఐస్ లో ఉంచి, మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత స్ధిరంగా ఉండే కంటైనర్లలో రవాణా చేస్తారని, వైరస్ ఉండడానికి ఆస్కారమే లేదని స్పష్టం చేస్తున్నారు.

భారత్ తో చైనాకు ఇతర అంశాలపై ఉన్న విభేదాలే తమ వ్యాపారంపై ప్రభావం చూపిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని రొయ్యల ఎగుమతి సంస్థల ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


More Telugu News