ముంబైలో దంచి కొడుతున్న వాన.. రెడ్ అలర్ట్ జారీ

  • మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
  • జలమయమైన పలు ప్రాంతాలు
  • రైల్వే సర్వీసులకు కూడా అంతరాయం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నగరాన్ని ముంచెత్తిన వర్షాలు ఈ ఉదయం కొంత శాంతించాయి. అయితే మళ్లీ భారీ వర్షాలు మొదలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పట్టాలపై నీరు ప్రవహిస్తుండటంతో రైల్వే సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. మరోవైపు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ ముంబై విభాగం అధికారి డాక్టర్ జయంత్ తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో 407 శిథిల భవనాలను నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకు ముందే గుర్తించింది. అయితే, వాటిలో ఇప్పటి వరకు 150 భవనాలను మాత్రమే కూల్చింది. మరోవైపు మహారాష్ట్ర-గోవా సముద్ర తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ముంబై ఓడరేవు అధికారులు హెచ్చరించారు. అవి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News