కాసేపట్లో పాదయాత్రను ప్రారంభించనున్న ఈటల రాజేందర్.. 23 రోజులు కొనసాగనున్న పాదయాత్ర!

  • ప్రజా జీవనయాత్ర పేరుతో పాదయాత్ర
  • కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభం
  • భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ శ్రేణులు
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాసేపట్లో తన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేపట్టబోతున్న తొలి కీలకమైన రాజకీయ కార్యాచరణ ఇదే కావడం గమనార్హం. ఈ పాదయాత్రకు సంబంధించి బీజేపీ శ్రేణులు, ఈటల అనుచరులు భారీ ఏర్పాట్లను చేశారు. పాదయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు పలువురు బీజేపీ నేతలు వచ్చారు. ఈ పాదయాత్రకు 'ప్రజా జీవనయాత్ర' అనే పేరు పెట్టారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈరోజు (తొలిరోజు) శనిగరం, మాదన్నవీధి, గురిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది.

మరోవైపు పాదయాత్ర గురించి నిన్న ఈటల మాట్లాడుతూ, బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. అందరి అండదండలు, ప్రేమాభిమానాలు తనకు కావాలని కోరారు. ఆత్మగౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని చెప్పారు. ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నానని అన్నారు.


More Telugu News