ఫేస్‌బుక్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫైర్.. తప్పుడు సమాచారంతో జనాన్ని చంపేస్తున్నారని ఆగ్రహం

  • టీకాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
  • టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు అతిపెద్ద వ్యాధిగా మారిందన్న బైడెన్
  • బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన ఫేస్‌బుక్
సామాజిక మాధ్యమాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని చంపేస్తున్నారని మండిపడ్డారు. ఫేస్‌బుక్ వంటి వాటిలో టీకాలపై జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు అతిపెద్ద వ్యాధిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సామాజిక మాధ్యమాల్లో టీకాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందేందుకు మార్గాలు ఉన్నాయే తప్ప, దానికి అడ్డుకట్ట వేసే మార్గాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా టీకాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందన్న ఆరోపణలను ఆ సంస్థ ప్రతినిధి డానీ లీవర్ ఖండించారు. కరోనాపై ఫేస్‌బుక్‌లో ఇచ్చిన అధికారిక సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారన్నారు. టీకా కేంద్రాల వివరాలను ఒక్క అమెరికాలోనే 30.3 లక్షల మంది పరిశీలించినట్టు తెలిపారు. ఫేస్‌బుక్ ప్రజల ప్రాణాలను కాపాడుతుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మ్యుటేషన్‌ చెందుతోందన్న అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని వివరించింది.


More Telugu News