అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం

  • గతేడాది సరిహద్దుల్లో ఘటన
  • వీరమరణం పొందిన శ్రీకాకుళం వాసి
  • సైన్యంలో లాన్స్ నాయక్ హోదాలో ఉన్న ఉమామహేశ్వరావు
  • భారీ ఆర్థికసాయం ప్రకటించిన సీఎం జగన్
శ్రీకాకుళం పట్టణానికి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు భారత సైన్యంలో లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తూ వీరమరణం పొందారు. గతేడాది సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉండగా, బాంబులు నిర్వీర్యం చేసే క్రమంలో అవి పేలడంతో ఉమామహేశ్వరరావు కన్నుమూశారు. ఈ క్రమంలో, ఆ వీరసైనికుడి కుటుంబానికి ఏపీ సర్కారు భారీ ఆర్థికసాయం ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆ అమరజవాను కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, ఉమామహేశ్వరరావు ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడారని కీర్తించారు. ఉమామహేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. అటు, జవాను కుటుంబ సభ్యులు స్పందిస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తమకు ఆర్థికసాయం అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమామహేశ్వరరావుకు భార్య నిరోష, ఇద్దరు కుమార్తెలున్నారు.


More Telugu News