'నారప్ప' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై నిర్మాత సురేశ్ బాబు వివరణ

  • వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన నారప్ప
  • త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్
  • నిరాశకు గురైన ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యాలు
  • తాము భాగస్వాములమేనన్న సురేశ్ బాబు
అగ్రహీరో వెంకటేశ్ నటించిన నారప్ప చిత్రాన్ని ఓటీటీ వేదికపై విడుదల చేస్తుండడం సినీ ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలను అసంతృప్తికి గురిచేస్తోంది. వెంకటేశ్ వంటి పెద్ద హీరో చిత్రం థియేటర్లలో రిలీజ్ అయితే ఎంతోమందికి లాభదాయకంగా ఉంటుందని, ఇటీవలి నష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే నారప్ప నిర్మాతలు ఓటీటీ బాట ఎంచుకోవడం పట్ల వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.

దీనిపై చిత్ర నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. నారప్ప చిత్రంలో తాము కేవలం భాగస్వాములము మాత్రమేనని స్పష్టం చేశారు. గత అనుభవాల నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన కలైపులి థాను 'నారప్ప' చిత్రాన్ని ఓటీటీ (అమెజాన్ ప్రైమ్) వేదికగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని, కరోనా థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో ఎవరూ నష్టపోరాదన్న ఉద్దేశంతోనే తాము ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.

"కరోనా విజృంభిస్తున్న ఈ రోజుల్లో మన కుటుంబ సభ్యులనే థియేటర్ కు పంపించడంలేదు... అలాంటిది ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రమ్మనడం భావ్యం కాదని భావిస్తున్నాం" అని సురేశ్ బాబు వివరణ ఇచ్చారు.


More Telugu News