డ్రోన్ల భరతం పట్టేందుకు డీఆర్డీవో నుంచి దేశీ సాంకేతిక అస్త్రం: అమిత్​ షా

  • భద్రతకు డ్రోన్లు సవాల్ గా మారాయి
  • రెచ్చగొడితే అదే భాషలో సమాధానం
  • బీఎస్ఎఫ్ రెండడుగులు ముందుండాలి
  • తొలిసారిగా సరిహద్దు బాధ్యతల్లో విభజన
  • బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అసోం రైఫిల్స్ కు అప్పగింత
ఉగ్రదాడులకు వినియోగిస్తున్న డ్రోన్ల భరతం పట్టేందుకు స్వదేశీ సాంకేతిక అస్త్రం సిద్ధం అవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం దేశ భద్రతకు డ్రోన్లు పెను సవాల్ గా మారాయని ఆయన అన్నారు. వాటిని అంతం చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) యాంటీ డ్రోన్ వ్యవస్థను తయారు చేస్తోందని చెప్పారు. ఇవ్వాళ సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 18వ ఇన్వెస్టిట్యూర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

భారత్ ను కృత్రిమ మేధ ద్వారా దెబ్బ తీసేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తాము శాంతినే కోరుకుంటున్నా.. దేశ భద్రతకు విఘాతం కలిగితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అదే భాషలో సమాధానం చెబుతామని అన్నారు. దేశ భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాలను వాడుకుంటున్నామని, కొత్త పద్ధతులను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

బీఎస్ఎఫ్ సిబ్బంది భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, వారి కుటుంబాలను ప్రభుత్వం చూసుకుంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. చొరబాటుదారుల కన్నా రెండడుగులు ముందే ఉండాలని, స్మగ్లర్లు, చట్ట ఉల్లంఘనులకన్నా ఒక అడుగు ముందుండాలని సూచించారు. అధికారులు పాత ధోరణుల నుంచి బయటకు రావాలని, వారిని ఎదుర్కొనేందుకు ఏవైనా కొత్త పద్ధతులను ఆలోచించాలని అన్నారు. భద్రతకు అవసరమైన పరిజ్ఞానంపై సాంకేతిక నిపుణులతో చర్చించాలన్నారు.

సరిహద్దుల్లో జవాన్లు చేసిన త్యాగాలు గొప్పవని ఆయన కొనియాడారు. ప్రపంచ పటంలో భారత ఖ్యాతి పెరుగుతోందని, దానికి కారణం వారి బలిదానాలేనని అన్నారు. మన సరిహద్దులను అనునిత్యం బీఎస్ఎఫ్, పారామిలటరీ బలగాలు కాపాడడం వల్లే మన ప్రతిష్ఠ పెరిగిందన్నారు. బలగాలకు ప్రత్యేక బాధ్యతలనూ తొలిసారిగా ఆయన అప్పగించారు. మయన్మార్ సరిహద్దులను అసోం రైఫిల్స్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను బీఎస్ఎఫ్, లడఖ్, దానికి ఆనుకుని ఉన్న సరిహద్దులను ఐటీబీపీ చూసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News