చంద్రుడిలో వణుకు.. 2030 నుంచి భూమిపై తరచూ వరదలు: నాసా హెచ్చరిక

  • యూనివర్సిటీ ఆఫ్ హవాయీతో కలిసి అధ్యయనం
  • తీర ప్రాంతాలకు పెను ముప్పు
  • రోజూ లేదా రోజు విడిచి రోజు వరద ప్రమాదం
  • ‘మూన్ వాబుల్’ సెకండ్ ఫేజ్ లో ఉన్నట్టు వెల్లడి
2030 నుంచి మొదలు.. 2040 వరకు పదేళ్లు వరదలు ముంచెత్తుతాయి. సముద్రం పోటెత్తి తీర ప్రాంతాలపైకి దండెత్తుంది. ఒక్క రోజో లేదంటే రెండు రోజులో కాదు.. ప్రతి రోజూ లేదా రోజు తప్పించి రోజు! జీవితాలను ఛిన్నాభిన్నం చేసేస్తుంది. బతికే దిక్కు లేకుండా మారుస్తుంది. ఇది ఎవరో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు.. నాసా అధ్యయనం చేసి ప్రభుత్వాలకు చేస్తున్న హెచ్చరిక. ఈ అతి వరదలు, అతి (ఎత్తైన) అలలకు కారణమేంటో తెలుసా? చంద్రుడు. అక్షరాలా చంద్రుడే. ఎలాగంటారా?

మామూలుగా మనకు చంద్రమానం, సూర్యమానం అని రెండు రకాల కాలాలుగా విభజించుకున్నాం కదా. చంద్రమానంలో జాబిల్లి తన కక్ష్యను చుట్టి రావడానికి 18.6 ఏళ్లు పడుతుంది. అందులో సగం వరకు.. అంటే ఓ 9.3 ఏళ్లు జాబిలి కక్ష్యలో ఎలాంటి మార్పులు జరగవు. ఆ సమయంలో సముద్రంలోని ఎత్తైన అలలు తగ్గిపోతాయి. తక్కువ ఎత్తులో అలలు పెరుగుతాయి. మిగతా సగం కక్ష్యను పూర్తి చేసే సమయంలో.. చంద్రుడు వణికిపోతుంటాడు (డోలాయమానం/అటూఇటూ ఊగడం– వాబుల్). ఆ క్రమంలో గురుత్వాకర్షణ బలాలు పెరుగుతాయి. ఆ తీవ్రత భూమి మీద పడుతుంది. సముద్రాలను అల్లకల్లోలం చేస్తుంది. మొదటి సగంలో జరిగిన పరిణామాలన్నీ ఇప్పుడు రివర్స్ అయిపోతాయి. ఎత్తైన అలలు ఎక్కువవుతాయి. తక్కువ ఎత్తులో ఉండే అలలు తగ్గిపోతాయి.
 
వాస్తవానికి 1728లో తొలిసారిగా గుర్తించిన ఈ పరిణామంతో అప్పుడు పెద్దగా ముప్పేమీ లేదు. మరి, ఇప్పుడే ఎందుకు ముప్పంటే.. పర్యావరణ మార్పులు, భూతాపంతో సముద్ర మట్టాలు పెరిగాయి.. సముద్రాల ఆటుపోట్లలో తేడాలుంటున్నాయి. కాలాలు మారుతున్నాయి. ఇవే కారణాలు.. మూన్ వాబుల్ తో భూమిపై సముద్ర వరదలకు కారణమవుతాయని నాసా హెచ్చరిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ హవాయీ శాస్త్రవేత్తలతో కలిసి నాసా సీ లెవెల్ చేంజ్ సైన్స్ టీమ్.. అమెరికాలోని 89 తీర ప్రాంతాల్లో అలల ఆటుపోట్ల తీరును పరిశీలించింది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ ఏజెన్సీ (ఎన్వోఏఏ) రూపొందించిన నమూనాతో వాటిలో మార్పులను గమనించింది. ఒక్క అమెరికాకే కాదు.. ప్రపంచం మొత్తంలోని తీర ప్రాంతాలకూ ఈ ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

2030 మధ్య నాటికి ఈ తీవ్రమైన వరదలు మొదలవుతాయని పరిశోధకులు హెచ్చరించారు. 2040 దాకా అవి కొనసాగే ముప్పుంటుందని అంటున్నారు. ఒకట్రెండు రోజులు వరదలు వస్తే సమస్య ఉండదు కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ వరదలు వచ్చే ప్రమాదం ఉందని, దాని వల్ల ప్రజల జీవనోపాధిపై పెను ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. ఇక, ఈ మూన్ వాబుల్ తో సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందనేది.. చంద్రుడు, భూమి, సూర్యుడి కక్ష్య క్రమంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ముందు నుంచే ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.


More Telugu News