ఆనంద‌య్య మందుపై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌.. న్యాయ‌వాదిపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం

  • కొన్ని రోజుల క్రితం ఆనంద‌య్య మందు నిలిపివేత‌
  • దాన్ని పునఃప్రారంభించాల‌ని అప్ప‌ట్లో పిటిష‌న్‌
  • నిన్న విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు
  • ఇలాంటి పిటిష‌న్‌తో కోర్టును అప‌హాస్యం చేయకూడ‌ద‌న్న‌ ధ‌ర్మాసనం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన‌ ఆనందయ్య త‌యారు చేస్తోన్న‌ మందు కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి బాగా పనిచేస్తోందని, ఆ మందు పంపిణీని పునఃప్రారంభించాలంటూ అభినంద‌న్ అనే ఓ న్యాయ శాస్త్ర విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఇటువంటి పిటిష‌న్ పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇలాంటి వ్యాజ్యాలతో కోర్టును అపహాస్యం చేయకూడ‌ద‌ని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఏఎస్ బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హెచ్చ‌రించింది. నిన్న దీనిపై విచారణ ప్రారంభం కాగానే ఈ పిటిష‌న్ ఉద్దేశం ఏంట‌ని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీంతో తాము ఈ పిటిషన్‌ వేసి చాలా రోజులైందని న్యాయ‌వాది చెప్పారు. సాంకేతికంగా పిటిషన్‌ విచారణ అవసరం లేదని చెప్పారు.

అయితే, ఇటువంటి వాటికి హైకోర్టుకు వెళ్లాలని, ఇలాంటి కేసులతో న్యాయ‌స్థానాన్ని అపహాస్యం చేయకూడ‌ద‌ని న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ ఉపసంహరణకు న్యాయ‌వాది అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం అంగీకరించ‌కుండా దాన్ని కొట్టేస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఆనందయ్య క‌రోనా మందును అప్ప‌ట్లో నిలిపేసి, తిరిగి ప్రారంభించిన విష‌యం తెలిసిందే.


More Telugu News