టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు

  • త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • పార్టీ ఎంపీలకు చంద్రబాబు ఉద్బోధ
  • అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడేదిలేదన్న చంద్రబాబు
త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సుమారు 18 అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాల పట్ల ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణతో జల వివాదాలు, నిధుల దారిమళ్లింపు, రఘురామకృష్ణరాజు వ్యవహారం తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని పార్లమెంటులో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు ఉద్బోధించారు.

ఈ భేటీలో పాల్గొన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆర్థిక అరాచకాన్ని పార్లమెంటులో లేవనెత్తి కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కేంద్ర పథకాల నిధులను రాష్ట్ర పథకాలకు మళ్లిస్తున్నారని, లెక్కల్లో చూపని నిధుల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. విశాఖ ఉక్కుపై వైసీపీ ప్రభుత్వ డ్రామాలను కూడా ఉభయ సభల్లో లేవనెత్తుతామని వివరించారు.


More Telugu News