గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల పెంపునకు ప్రభుత్వం కసరత్తులు: ఏపీపీఎస్సీ

  • వివరాలు తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు
  • 1,180 ఖాళీలు గుర్తించినట్టు వెల్లడి
  • వచ్చే నెలలో నోటిఫికేషన్లు
  • ఇకపై వేగంగా ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడు షేక్ సలాంబాబు ఉద్యోగ నియామకాల అంశంపై స్పందించారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇప్పటివరకు 1,180 ఖాళీలను గుర్తించామని తెలిపారు. ఈ ఖాళీల్లో గ్రూప్-1, గ్రూప్-2 సహా వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయని సలాంబాబు వివరించారు. పోస్టులు పెంచుతూ వచ్చే నెల గ్రూప్స్ తో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు.

ఇకపై గ్రూప్-1 మినహా మిగతా ఏ నోటిఫికేషన్ కు ప్రిలిమ్స్ ఉండవని సలాంబాబు వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే అన్ని నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చాకే వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక మీదట మూడు, నాలుగు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని వివరించారు.

తాజా పరిణామాలపై స్పందిస్తూ... ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించినవారిపై చర్యలు ఉండవని సలాంబాబు స్పష్టం చేశారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు.


More Telugu News