‘చలో రాజ్‌భవన్‌’ పిలుపు వేళ తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటోన్న పోలీసులు

  • పెట్రోలు, డీజిల్‌ ధరలపై ఆందోళ‌న‌
  • రాజ్ భ‌వ‌న్‌ వెళ్లేందుకు కాంగ్రెస్ నేత‌ల ప్ర‌య‌త్నాలు
  • ఇళ్ల వ‌ద్దే క‌ట్ట‌డి చేస్తోన్న పోలీసులు
  • మండిప‌డ్డ మ‌ల్లు ర‌వి
రోజురోజుకీ పెరిగిపోతూ సామాన్యుడిని మరిన్ని క‌ష్టాల‌కు గురిచేస్తోన్న పెట్రోలు, డీజిల్‌ ధరలపై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ఆందోళ‌న చేప‌ట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన‌ ‘చలో రాజ్‌భవన్‌’ పిలుపు మేర‌కు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు. అయితే, ఈ నిర‌స‌న‌కు పోలీసులు అనుమతి నిరాకరించి ఎక్క‌డిక‌క్క‌డ నేత‌ల‌ను అడ్డుకుంటున్నారు.

హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద 200 మందితో సమావేశమయ్యేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిన‌ట్లు తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా ఇళ్ల వద్దే క‌ట్ట‌డి చేశారు. పోలీసులు అడ్డుకుంటున్న‌ప్ప‌టికీ వారి నుంచి త‌ప్పించుకుని వెళ్లి కొంద‌రు కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజ్‌భవన్ వ‌ద్ద‌ నిరసన తెలిపారు. అంతేగాక‌, రాజ్‌భవన్‌ మెయిన్‌ గేటుకు పార్టీ జెండాలు తగిలించారు.

పోలీసులు త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకుంటుండ‌డం ప‌ట్ల టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిర‌స‌న తెలిపేందుకు వెళ్తున్న నేత‌లను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆయ‌న మండిపడ్డారు. ప్ర‌భుత్వం నియంతృత్వ ధోర‌ణిని క‌న‌బ‌ర్చుతోంద‌ని , ఇత‌ర‌ జిల్లాల నుంచి కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసేందుకు పోలీసులే అనుమతి నిచ్చార‌ని, మ‌ళ్లీ అక్క‌డ‌కు వెళ్తుంటే అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News