పెట్రో ధరల పెంపును నిరసిస్తూ రేపు హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ 'ఛలో రాజ్ భవన్'

  • దేశంలో మండిపోతున్న చమురు ధరలు
  • నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం
  • రేపు ఉదయం ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ
  • గవర్నర్ కు వినతిపత్రం ఇస్తామన్న రేవంత్ రెడ్డి
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటుండడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో 'ఛలో రాజ్ భవన్' చేపడుతున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ నుంచి ర్యాలీ జరుగుతుందని తెలిపారు. పెట్రో ధరల పెంపుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తీరుపై గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంటును కూడా స్తంభింపజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని, నిర్బంధించాలని చూస్తే పోలీస్ స్టేషన్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్ని జైళ్లలో పెడతారో, ఎన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తారో చూస్తాం అని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై మోదీ, కేసీఆర్ కలిసి ప్రజల నుంచి రూ.35 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని రేవంత్ ఆరోపించారు.


More Telugu News