రిషభ్ పంత్‌కు కరోనా.. క్వారంటైన్ లో ఉన్న యువ ఆటగాడు

  • ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు
  • 8 రోజుల క్రితమే కరోనా సోకినట్టు సమాచారం
  • 18న పంత్ కు మరోసారి కోవిడ్ టెస్ట్ చేయనున్న వైనం
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుకు షాక్ తగిలింది. భారత జట్టుకు చెందిన ఒక ఆటగాడు కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆటగాడు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో రిషభ్ ను ఇతర ఆటగాళ్లకు దూరంగా క్వారంటైన్ లో ఉంచారు. రిషభ్ కు పాజిటివ్ అని నిర్ధారణ అయి ఎనిమిది రోజులు అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18న పంత్ కు మరోసారి కోవిడ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ టెస్టులో నెగెటివ్ వస్తే టీమిండియా జట్టుతో రిషభ్ కలుస్తాడు.

న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్ట్ ఫైనల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు 40 రోజుల వ్యవధి ఉండటంతో ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతిని కల్పించింది. దీంతో ఆటగాళ్లు లండన్ వీధుల్లో విహరించారు. కొందరు యూరో కప్, వింబుల్డన్ మ్యాచులకు వెళ్లారు. రిషభ్ పంత్ యూరో కప్ మ్యాచ్ లు వీక్షించేందుకు వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల మధ్య మాస్క్ లేకుండానే కూర్చొని ఫొటోలకు పోజులిచ్చాడు. అక్కడే పంత్ కు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. అతనికి డెల్టా వేరియంట్ సోకినట్టు సమాచారం.


More Telugu News