నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని జ‌గ‌న్ గారి ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా హెచ్చరిస్తోంది: సోము వీర్రాజు

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తయిందని ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటోంది
  • అంతకంటే గొప్పగా నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి
  • ఇళ్లు, భూములు అన్నీ వదిలేసి వారు వెళ్లారు
  • లేదంటే పార్టీ ఉద్యమాన్ని చేపడుతుంది
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు ప్ర‌భుత్వానికి ఇచ్చేసి వెళ్లిన వారి క‌ష్టాల‌ను బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తెలుసుకున్నారు. నిన్న ఆయ‌న నిర్వాసితుల‌ను క‌లిసి, వారి నుంచి విన‌తి ప‌త్రాల‌ను తీసుకున్నారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

'పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తయిందని ఎలాగయితే గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నదో, అంతకంటే గొప్పగా ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, భూములు అన్నీ వదిలేసిన ముంపు ప్రాంత ప్రజలకు సరైన న్యాయం చేయాలి. దీనిపై కూడా దృష్టి సారించి, క‌చ్చితమైన ఉపాధి, పునరావాసాలను కల్పించి, వారి హక్కుగా ఇవ్వవలసిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా ప్రాజెక్టుతో సమానంగా 70 శాతం పూర్తి చేయాలని బీజేపీ ఏపీ డిమాండ్ చేస్తోంది' అని సోము వీర్రాజు చెప్పారు.

'ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి, ఆలస్యం చేస్తే ముంపు ప్రాంత వాసులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపడుతుందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గారి ప్రభుత్వాన్ని పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది' అని సోము వీర్రాజు చెప్పారు.


More Telugu News