నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియామకం

  • నూతన ప్రధాని నియామకంపై సుప్రీం ఆదేశం
  • దేవ్ బాను ప్రధానిగా నియమించిన దేశాధ్యక్షురాలు
  • రాజకీయ అస్థిరతకు తెరదించే ప్రయత్నం
  • ఐదోసారి ప్రధానిగా వస్తున్న దేవ్ బా
నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షేర్ బహదూర్ దేవ్ బాను నూతన ప్రధానమంత్రిగా నియమిస్తూ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. 74 ఏళ్ల దేవ్ బా నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ప్రధాని పీఠం అధిష్ఠించిన అనంతరం దేవ్ బా 30 రోజుల్లో పార్లమెంటులో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేవ్ బాకు ప్రధాని పీఠం కొత్త కాదు. ఆయన గతంలో 1997-2018 నడుమ నాలుగు సార్లు ప్రధానిగా వ్యవహరించారు.

గత ప్రధాని కేపీ ఓలి సొంతపార్టీలో అసమ్మతి కారణంగా రాజీనామా చేశారు. గత డిసెంబరులో ప్రతినిధుల సభను రద్దు చేశారు. అయితే దీనిపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కాగా, ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో మరోసారి కేపీ ఓలి ప్రధానిగా బాధ్యతలు అందుకున్నారు. అయినప్పటికీ నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో అసమ్మతి చల్లారకపోవడంతో ఓలి మరోసారి ప్రతినిధుల సభను రద్దు చేశారు.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేపీ ఓలి సిఫారసుతో ప్రతినిధుల సభను దేశాధ్యక్షురాలు రద్దు చేయడం తగదని అభిప్రాయపడింది. జులై 18న సభను సమావేశపర్చాలని స్పష్టం చేసింది. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్ బా ను ప్రధానిగా నియమించాలని పేర్కొంది.


More Telugu News