హైదరాబాదులో "పిల్లి కనిపించుట లేదు"... ఆచూకీ తెలిపితే రూ.30 వేలు ఇస్తానంటున్న యజమాని!

  • జింజర్ అనే పిల్లిని పెంచుకుంటున్న మహిళ
  • జూన్ 17న పిల్లికి శస్త్రచికిత్స
  • ఆపై మరోసారి ఆసుపత్రికి
  • ఆసుపత్రిలోనే మిస్సింగ్
  • పోలీసులకు ఫిర్యాదు
పెంపుడు జంతువులను ప్రాణప్రదంగా చూసుకునేవారు, అవి కనిపించకపోతే తల్లడిల్లిపోతారు. హైదరాబాదుకు చెందిన సెరీనా నట్టో అనే మహిళ కూడా తన పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన పిల్లి ఆచూకీ తెలిపిన వారికి రూ.30 వేలు నజరానా అందిస్తానని కూడా ఆమె ప్రకటించారు. నగరంలోని రాయదుర్గంలో ఓ యానిమల్ కేర్ సెంటర్ నుంచి తన పెంపుడు పిల్లి తప్పిపోయిందని సెరీనా వెల్లడించారు.

సెరీనా టోలీచౌకీలో నివసిస్తుంటారు. ఆమె పెంపుడు పిల్లి పేరు జింజర్. జూన్ 23న ఆ పిల్లిని ట్రస్టీ వెట్ మల్టీ స్పెషాలిటీ పెంపుడు జంతువుల ఆసుపత్రిలో చేర్చారు. ఆ మరుసటి రోజే పిల్లి కనిపించడంలేదని ఆసుపత్రి వర్గాలు సెరీనాకు సమాచారం అందించాయి.

దీనిపై సెరీనా మాట్లాడుతూ, తాను జూన్ 17న జింజర్ కు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లానని, అయితే శస్త్రచికిత్స అనంతరం ఆ పిల్లి నీరసంగా ఉండడంతో జూన్ 23న మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లానని వివరించారు. ఆ పిల్లిని ఆసుపత్రిలో చేర్చాలని డాక్టర్లు చెప్పడంతో తాను అంగీకరించానని, కానీ తన పిల్లి కనిపించకుండా పోయిందని వాపోయింది. తన పిల్లికి సర్జరీ జరిగినందున, దానికి వైద్యసాయం తప్పనిసరి అని, ఇప్పుడది ఎలా ఉందోనని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై తాను రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సెరీనా వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరానని, తన పిల్లి ఎక్కుడుందో చెబితే రూ.30 వేలు అందిస్తానని ఆమె ప్రకటించారు. ఈ వ్యవహారంపై రాయదుర్గం పోలీసులు స్పందిస్తూ, పిల్లి కనిపించడంలేదని తమకు ఫిర్యాదు అందిందని, ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.


More Telugu News