ఆగస్టు 9న హైదరాబాద్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర.. ప్రారంభించనున్న నడ్డా!

  • భాగ్యలక్ష్మి  ఆలయం నుంచి సంజయ్ పాదయాత్ర ప్రారంభం
  • నడ్డాకు వీలుకాకుంటే ముఖ్యమైన జాతీయ నేతను ఆహ్వానించాలని నిర్ణయం
  • నాలుగు విడతలుగా పాదయాత్ర
హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇందుకోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 9 నుంచి పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలై హుజూరాబాద్‌లో ముగియనున్న ఈ యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిన్న బండి సంజయ్ నిర్వహించిన సమావేశంలో పాదయాత్రపై చర్చించారు. పాదయాత్రకు జేపీ నడ్డాను ఆహ్వానించడంపై చర్చ జరిగింది.

నడ్డా రాలేని పక్షంలో మరో జాతీయ నేత, లేదంటే ముఖ్యమైన కేంద్రమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నాలుగు విడతలుగా జరిగే ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు 20 కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పాదయాత్రలో భాగంగా బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. కాగా, ఈ ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో బండి సంజయ్ సమావేశమై పాదయాత్రపై చర్చించనున్నారు.


More Telugu News