ఒక కోణంలోనే చూసే మీకు రెండో కోణం గురించి చెప్పేందుకు యత్నిస్తున్నాను: జగన్ కు రఘురాజు లేఖ

  • తెలుగు అకాడమీ పేరు మార్చడం దారుణం
  • తెలుగు భాష ఔన్నత్యాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నా
  • మీ నిర్ణయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా వ్యతిరేకిస్తున్నారు
తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కీలకమైన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని, ఈ విషయంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలని సీఎం జగన్ కు సూచిస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

ఏ సమస్యనైనా ఒకే కోణం నుంచి మాత్రమే చూసే మీకు రెండో కోణం గురించి చెప్పేందుకే తాను ప్రయత్నిస్తున్నానని రఘురాజు లేఖలో పేర్కొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని మీకు అర్థం అయ్యేలా చెప్పేందుకు తన వంతుగా చేస్తున్న ప్రయత్నం ఇది అని అన్నారు. తెలుగు అకాడమీని పలుచన చేయడం ద్వారా తెలుగు ప్రజలకు మీరు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.

ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలని మీరు శత విధాలా ప్రయత్నం చేసినప్పుడే మీరు తెలుగు భాషను తుడిచిపెట్టే సాహసం చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందారని... ఆ ఆందోళనకు కొనసాగింపుగా ఇప్పుడు తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సంస్కృతానికి పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పడం... తల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి పట్టుచీర తెచ్చాడన్నట్టుగా ఉందని రఘురాజు ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారు మాత్రమే కాకుండా... ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.


More Telugu News