ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ పై నిరసనలకు మావోయిస్టుల మద్దతు

  • ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సర్కారు
  • నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • ఆందోళనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు
  • ఆడియో విడుదల చేసిన మావోయిస్టులు
ఇటీవల ఏపీ సర్కారు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపడుతుండడం తెలిసిందే. తాజాగా, దీనిపై మావోయిస్టులు స్పందించారు. ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు విశాఖ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరిట ఓ ఆడియో విడుదలైంది.

ఈ ఆడియోలో అరుణ మాట్లాడుతూ, ప్రభుత్వం మోసపూరిత విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. వేల సంఖ్యలో పాఠశాలలు మూతపడ్డాయని, వేలాదిమంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ కొత్త విద్యావిధానం లోపభూయిష్టమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News