దేశంలో ధరల పెరుగుదలపై ఈ మధ్యప్రదేశ్ మంత్రివర్యులు ఏమన్నారో చూడండి!

  • దేశంలో ధరల పెరుగుదల తీవ్రం
  • ప్రజల్లో ఆందోళన
  • మీడియా ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి సక్లేచా
  • కష్టాలుంటేనే సుఖం విలువ తెలుస్తుందని వెల్లడి
భారత్ లో కొన్నాళ్లుగా ధరలకు రెక్కలొచ్చాయి. చమురు, ఇతర నిత్యావసరాల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, మధ్యప్రదేశ్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఓం ప్రకాశ్ సక్లేచా ధరల పెరుగుదలపై తాత్విక రీతిలో అభిప్రాయాలు వినిపించారు. కష్టాలు ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుందని సెలవిచ్చారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ "కొన్ని సంతోషకరమైన క్షణాలు ఉంటాయన్న విషయం మనకు సమస్యల ద్వారానే అర్థమవుతుంది. జీవితంలో కష్టమే లేకపోతే సుఖానికి విలువేముంది? కష్టం అంటే తెలియని వాడు సుఖాన్ని ఏవిధంగా ఆస్వాదించగలడు? కష్టాలే సుఖానికి దారి చూపిస్తాయి" అని వివరించారు.

దేశంలో ధరల పెరుగుదల నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యంగా భావించాలా? అని ఓ మీడియా ప్రతనిధి ప్రశ్నించగా, మీలాంటివాళ్లు దుష్ప్రచారాలు చేయడం వల్లే ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారని మంత్రి ఓం ప్రకాశ్ సక్లేచా మండిపడ్డారు.

అయితే దీనిపై కాంగ్రెస్ వర్గాలు విమర్శలు చేశాయి. బీజేపీ నిజస్వరూపం ఇదేనని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి  అజయ్ సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఓవైపు కరోనా ప్రజలను అతలాకుతలం చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం పన్నులతో ప్రజలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు.


More Telugu News