'ఫిజియోథెరపీ' చేస్తానంటూ మహిళా అథ్లెట్లపై లైంగిక అకృత్యాలు... తమిళనాడు కోచ్ పై ఫిర్యాదులు

  • చెన్నైలో క్రీడా శిక్షకుడిగా కొనసాగుతున్న నాగరాజన్
  • మహిళా అథ్లెట్ల పాలిట కీచకావతారం
  • ఫిట్ నెస్ పేరిట అమ్మాయిలపై అఘాయిత్యాలు
  • ఓ అథ్లెట్ ఫిర్యాదుతో నాగరాజన్ అరెస్ట్
తమిళనాడు క్రీడా విభాగం కోచ్ పి. నాగరాజన్ (59) పై లైంగిక దాడుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ మహిళా అథ్లెట్ తనపై కోచ్ నాగరాజన్ గత కొన్నేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా, మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు తమపైనా నాగరాజన్ దారుణాలకు పాల్పడ్డాడంటూ ముందుకు వచ్చారు.

"ఫిజియోథెరపీ చేస్తాను, ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది" అంటూ తమపై లైంగికదాడికి పాల్పడేవాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తనకు 'సహకారం' అందించకపోతే పెద్ద ఈవెంట్లలో పాల్గొనలేరని బెదిరింపులకు దిగేవాడని వారు తెలియజేశారు. ఇటీవల ఫిర్యాదు చేసినవారిని ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. అథ్లెట్లు గాయాలపాలవడం సహజమని, అయితే వారు గాయపడినప్పుడు అదొక అవకాశంగా తీసుకుని వారికి 'ఫిజియో థెరపీ' చేసేందుకు ప్రయత్నించేవాడని, ఆ విధంగా తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని పోలీసులు పేర్కొన్నారు.

చెన్నైలో స్పోర్ట్స్ అకాడెమీ ఏర్పాటు చేసి క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్న నాగరాజన్ పై 19 ఏళ్ల యువ అథ్లెట్ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు తనలోని క్రీడా నైపుణ్యాన్ని చూసి తనపై శ్రద్ధ చూపిస్తున్నాడేమో అనుకున్నానని, కానీ అతడి అసలు నైజం వెల్లడయ్యాక తీవ్ర భయాందోళనలకు గురయ్యానని ఆ అమ్మాయి వెల్లడించింది. కాగా, తనపై ఫిర్యాదు దాఖలైందని తెలియగానే సదరు కీచక కోచ్ ఆత్మహత్యాయత్నం చేశాడు.


More Telugu News