మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు... కొల్లు రవీంద్ర అరెస్ట్

  • చింతచెట్టు సెంటర్ లో ఆక్రమణల తొలగింపు
  • మున్సిపల్ అధికారుల తీరుకు కొల్లు రవీంద్ర నిరసన
  • రోడ్డుపై బైఠాయింపు
  • టీడీపీ మద్దతుదారులవి తొలగిస్తున్నారని ఆరోపణ
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టగా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పట్టణంలోని చింతచెట్టు సెంటర్ వద్ద మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరుల దుకాణాలు తొలగించడం ఏంటని ఆయన అధికారులను నిలదీశారు. బాధితులకు మద్దతుగా పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడే రోడ్డుపై బైఠాయించారు.

వారిని అక్కడి నుంచి తొలగించే క్రమంలో పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. అనంతరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర స్పందిస్తూ, కొందరు మైనారిటీ వర్గాలకు చెందిన వారు గత పదిహేనేళ్లుగా ఇక్కడే ఉంటున్నారని, మిగిలిన నిర్మాణాలను వదిలివేసి, మైనారిటీ వర్గీయుల నిర్మాణాలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News