ఢిల్లీ ప్రజలకు షాక్.. శబ్ద కాలుష్యానికి పాల్పడితే లక్ష వరకు జరిమానా

  • నిర్ణీత గడువు తర్వాత టపాసులు పేలిస్తే వెయ్యి జరిమానా
  • సైలెంట్ జోన్లో రూ. 3 వేల జరిమానా
  • పదేపదే ఉల్లంఘిస్తే లక్ష జరిమానా
ఢిల్లీ వాసులకు అక్కడి కాలుష్య నియంత్రణ మండలి షాకిచ్చింది. ఇకపై ఏవైనా వేడుకలు, కార్యక్రమాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్టు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం పండుగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో నిర్ణీత గడువు తర్వాత టపాసులు పేల్చే వారికి రూ. 1000 జరిమానా విధిస్తారు. సైలెంట్ జోన్లలో టపాసులు కాలిస్తే రూ. 3 వేల జరిమానా విధిస్తారు.

పబ్లిక్ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలు, పెళ్లి వేడుకల్లో బాణసంచా కాల్చితే రూ. 10 వేల జరిమానా విధించబోతున్నారు. అదే సైలెంట్ జోన్లలో అయితే రూ. 20 వేల జరిమానా విధిస్తారు. ఈ ప్రాంతాల్లో రెండోసారి నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 40 వేలు, అంతకన్నా ఎక్కువ సార్లు ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా విధించనున్నారు. మరోవైపు లౌడ్ స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ను ఉపయోగించినా రూ. 10 వేల జరిమానా విధిస్తామని అధికారులు చెప్పారు. భారీ శబ్దాలు వచ్చే నిర్మాణ పరికరాలను ఉపయోగిస్తే రూ. 50 వేల జరిమానా విధించనున్నారు.


More Telugu News