కేసీఆర్ ఉన్నంత కాలం కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అసంభవం: రేవంత్ రెడ్డి

  • సీఎం కావాలనే కేటీఆర్ కోరిక నెరవేరదు
  • దోపీడీకి, మోసానికి కల్వకుంట్ల కుటుంబం మారుపేరు
  • కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులందరూ టీడీపీ వాళ్లే
ముఖ్యమంత్రి కావాలనే కేటీఆర్ కోరిక నెరవేరబోదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ బతికున్నంత కాలం కేటీఆర్ సీఎం కాలేరని చెప్పారు. తనను టీడీపీ అంటూ టీఆర్ఎస్ నేతలు అంటున్నారని... అసలు కేసీఆర్ ఎవరో చెప్పాలని అన్నారు. తాను చంద్రబాబుకు సహచరుడిగా పని చేశానని తెలిపారు. కేసీఆర్ ది బానిస బతుకని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు తారకరామారావు అని పేరు పెట్టుకునే అర్హత లేదని అన్నారు. 610 జీవో ప్రకారం వెళ్తే కేటీఆర్ కు చప్రాసీ పదవి కూడా రాదన్నారు.

దోపిడీకి, మోసానికి కల్వకుంట్ల కుటుంబం మారుపేరని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానంటూ కేసీఆర్ భార్యా, పిల్లలను ఢిల్లీకి తీసుకెళ్లి సోనియా కాళ్ల మీద పడ్డారని రేవంత్ అన్నారు. తెలంగాణను ఇచ్చిన తర్వాత సోనియాను మోసం చేశారని మండిపడ్డారు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని కేసీఆర్ రద్దు చేస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ లో ఉన్న మంత్రులందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ నేత ఎల్.రమణను కూడా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ మాదిరి తండ్రి నుంచి తాను పదవులను తెచ్చుకోలేదని... సొంతంగా కష్టపడి పీసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగానని రేవంత్ అన్నారు. తాను పీసీసీ పదవిని పైసలు పెట్టి కొన్నట్టయితే... కేటీఆర్ తండ్రి కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని ఎన్ని పైసలకు తెచ్చుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వదిలే ప్రసక్తే లేదని... రాబోయే రోజుల్లో వారిపై కార్యచరణను ప్రారంభించబోతున్నామని చెప్పారు.


More Telugu News