రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే కేటీఆర్ తాట తీస్తాం: సంపత్ కుమార్

  • సోనియా తెలంగాణను ఇవ్వడం వల్లే కేటీఆర్ పదవులను అనుభవిస్తున్నాడు
  • కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్ కు తెలియకపోవడం దౌర్భాగ్యం
  • కాంగ్రెస్ లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. చిన్న పదవి రాగానే ఎగిరెగిరి పడుతున్నాడంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా రేవంత్ అభివర్ణించడంపై కూడా సెటైర్లు వేశారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. కేటీఆర్ ఈరోజు పదవులను అనుభవిస్తున్నాడంటే... దానికి కారణం సోనియాగాంధీనే అని అన్నారు. తెలంగాణను సోనియా ఇవ్వడం వల్లే కేటీఆర్ పదవులను అనుభవిస్తున్నాడని... చరిత్రను మర్చిపోయి మాట్లాడవద్దని అన్నారు. రేవంత్ రెడ్డి గురించి మరోసారి ఇదే విధంగా అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్ర కేటీఆర్ కు తెలియకపోవడం ఆయన దౌర్భాగ్యమని సంపత్ కుమార్ అన్నారు. కేసీఆర్ మాదిరి రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టి ఊరేగింపుగా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుందనే భయంతోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారని సంపత్ చెప్పారు.

తెలంగాణను ఇచ్చిన సోనియాపై కేసీఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞత లేదని... కానీ, సోనియాపై గౌరవంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను వదిలే ప్రసక్తే లేదని... ఏ పుట్టలో ఉన్నా వదలిపెట్టబోమని హెచ్చరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? లేక రాళ్ల దెబ్బలు తింటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News