చైనా సైన్యంలోకి టిబెట్​ యువత.. సరిహద్దుల్లో పట్టుకోసం డ్రాగన్​ దేశం ఎత్తుగడ

  • తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వైనం
  • చైనా అధ్యక్షుడికి విధేయులుగా మారే పరీక్షలు 
  • మాండరిన్ భాషను నేర్పించి సైన్యంలోకి
  • ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద కార్యకలాపాల కోసం టిబెట్ యువతను చైనా తన సైన్యంలోకి తీసుకుంటోంది. ముందుగా వారిని చైనాకు విధేయులుగా మారుస్తోంది. దలైలామా వంటి గురువుల బోధనలను పక్కనపెట్టేలా చేసి.. తమకు అన్నీ చైనా అధ్యక్షుడే అనేలా మార్చేస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

‘‘సరిహద్దుల వద్ద ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించేందుకు చైనా సైన్యం.. టిబెట్ యువతను నియమించుకుంటోందన్న నిఘా సమాచారం మాకుంది. యుద్ధ సన్నద్ధత కోసం వారికి ప్రతిరోజూ అక్కడ తర్పీదునిస్తున్నట్టు సమాచారం ఉంది’’ అని ఓ అధికారి చెబుతున్నారు. సైన్యంలోకి చేర్చుకునే ముందు వారికి విధేయత పరీక్షలు పెడుతున్నారని, వారికి చైనా భాష (మాండరిన్)ను నేర్పిస్తున్నారని అంటున్నారు.

కాగా, వారిని సైన్యంలోకి తీసుకుంటే ఇప్పటికీ స్వతంత్రంగానే ఉన్న టిబెట్ లోని కొన్ని ప్రాంతాల వారు చైనాను అంగీకరించే పరిస్థితి ఉంటుందని, అంతేగాకుండా టిబెట్ లో చైనా ఆర్మీకి బదులు స్థానిక యువతనే పహారాగా పెట్టొచ్చని చైనా భావిస్తున్నట్టు సమాచారం. ఇటు లడఖ్ లోనూ టిబెట్ యువతతోనే మోహరింపులు చేయొచ్చన్న ఆలోచనలోనూ ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, భారత్ కూడా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్) పేరిట టిబెట్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులతో ఓ ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి 1962 లో చైనాతో యుద్ధం తర్వాత ఆ బలగాలను ఏర్పాటు చేసిన ఆర్మీ.. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)తో కలిసి శిక్షణనిచ్చింది.

గత ఏడాది పాంగోంగ్ సరస్సులో చైనా ఆక్రమించిన కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించింది ఈ ఎస్ఎఫ్ఎఫ్ బలగాలే. ఈ నేపథ్యంలోనే చైనా కూడా ఇదే ఎత్తుగడను అవలంబించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.


More Telugu News