తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 37 ఏళ్ల మాజీ ఐపీఎస్ అన్నామలై

  • 2011 కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అన్నామలై
  • 2019 సెప్టెంబర్ లో ఐపీఎస్ కు రాజీనామా
  • బీజేపీలో చేరి ఏడాది కూడా గడవకుండానే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
తమిళనాడు రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైను తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించిన ఎల్.మురుగన్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. దీంతో, అన్నామలైను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. మరోవైపు అన్నామలైను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది.

అన్నామలై వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. 2011 కర్ణాటక కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. కర్ణాటకలోని ఉడుపి, చిక్కమగళూరు జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. బెంగళూరు సౌత్ డీసీపీగా కూడా బాధ్యతలను నిర్వహించారు. 2019 సెప్టెంబర్ లో ఐపీఎస్ కు రాజీనామా చేశారు. రాజకీయాల కోసమే ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐపీఎస్ కు రాజీనామా చేసిన 11 నెలల తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవకుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అన్నామలై ఓటమిపాలయ్యారు. 24,816 ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. పార్టీలో చేరి ఏడాది కూడా కాకముందే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆయన చేజిక్కించుకోవడం గమనార్హం. తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడు అన్నామలై కావడం గమనార్హం.


More Telugu News