త్వరలోనే కొవాగ్జిన్​ కు అనుమతులు: డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త

  • ఆగస్టు చివరి నాటికి రావొచ్చని వెల్లడి
  • టీకా మూడో దశ ఫలితాలు బాగున్నాయి
  • డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు తగ్గట్టే ఉన్నాయి
తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అతి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీకా మూడో దశ ట్రయల్స్ ఫలితాలపై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలు బాగున్నాయని, ఆగస్టు చివరి నాటికి టీకాకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

టీకా సామర్థ్యం, రక్షణ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు తగ్గట్టు ఉన్నాయని తెలిపారు. కరోనాలోని వివిధ రకాలపైనా పరీక్షలు చేసి చూశారన్నారు. సగటు ఫలితాలు చాలా బాగున్నాయని, అయితే, డెల్టా వేరియంట్ పై మాత్రం టీకా ప్రభావం కొద్దిగా తగ్గిందని, అప్పటికీ టీకా బాగానే పనిచేస్తోందని ఆమె చెప్పారు.

ఈ డేటా మొత్తాన్ని ప్రీక్వాలిఫికేషన్, రెగ్యులేటరీ విభాగాలు పరిశీలించి అనుమతులను మంజూరు చేస్తాయన్నారు. జూన్ 23న ప్రీక్వాలిఫికేషన్ సమావేశం జరిగిందని, టీకా సామర్థ్యం, రక్షణ, టీకా తయారీలో అవలంబించిన మంచి పద్ధతులు తదితర అంశాలపై రెగ్యులేటరీ విభాగం విశ్లేషణ చేస్తుందని, అనుమతులే తరువాయి అని సౌమ్య చెప్పారు. గత శనివారం కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం టీకా సామర్థ్యం 77.8 శాతంగా తేలింది.


More Telugu News