ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే: ట్విట్టర్ కు స్పష్టం చేసిన కేంద్రమంత్రి

  • నూతన ఐటీ చట్టం తీసుకువచ్చిన కేంద్రం
  • ట్విట్టర్ సాగతీత ధోరణి
  • కేంద్రం ఆగ్రహం
  • భారత్ లో ఉన్నప్పుడు భారత్ చట్టాలు పాటించాలన్న వైష్ణవ్
కేంద్రం, ట్విట్టర్ మధ్య అంతరం కొనసాగుతోంది. చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకంలో ట్విట్టర్ సాగతీత ధోరణి వ్యవహరిస్తుండడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. భారత్ లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని సోషల్ మీడియా సంస్థలు నూతన ఐటీ చట్టాన్ని కచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది.

ఈ అంశంపై తాజాగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిందేనని, ఎవరూ అతీతులు కారని ట్విట్టర్ కు తేల్చి చెప్పారు. భారత్ లో నివసిస్తూ, ఇక్కడే పనిచేస్తున్న వారందరూ దేశం నియమనిబంధనలను పాటించకతప్పదని స్పష్టం చేశారు. అశ్విని వైష్ణవ్ కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. ఐటీ మంత్రి అయ్యాక తొలిసారి పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇదిలావుంచితే, ఇవాళ ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకంపై ట్విట్టర్ వివరణ ఇచ్చింది. ఎనిమిది వారాల్లో పూర్తిస్థాయి చీఫ్ కాంప్లయన్స్ అధికారి నియామకం పూర్తవుతుందని తన అఫిడవిట్లో వెల్లడించింది. తాత్కాలిక చీఫ్ కాంప్లయన్స్ అధికారిగా స్థానికుడినే నియమించినట్టు తెలిపింది.


More Telugu News