సోనియాను తెలంగాణ తల్లి అన్నాడు.. చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం

  • గతంలో సోనియాను బలి దేవత అన్నారు
  • అది టీపీసీసీ కాదు.. టీడీపీసీసీ
  • ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో సోనియాను బలిదేవత అని రేవంత్ అన్నారని... ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నారని... రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ కు ఇంకా టీడీపీ వాసనలు పోలేదని విమర్శించారు. అది టీపీసీసీ కాదని... తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్ కమిటీ అని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ అంటున్నారని... నువ్వు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చావు కదా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా పార్టీ మారారని... ఆయనను కూడా రాళ్లతో కొట్టాలా? అని ప్రశ్నించారు. చిన్న పదవి రాగానే రేవంత్ పెద్ద బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో పాదయాత్రల సీజన్ రాబోతోందని... పాదయాత్రలు చేయండి, ఆరోగ్యం కూడా బాగుంటుందని విపక్ష నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ పల్లెల్లో ఎలాంటి అభివృద్ది జరిగిందో బండి సంజయ్ పాదయాత్రలో చూడాలని అన్నారు. తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో అయినా జరిగిందా? అని ప్రశ్నించారు.


More Telugu News