జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా

  • అక్రమాస్తుల కేసులో గతంలో జగన్ కు బెయిల్
  • బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్
  • విచారణ కొనసాగించిన సీబీఐ కోర్టు
  • లిఖితపూర్వక వాదనలకు సీబీఐ నిరాకరణ
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై నేడు కోర్టులో విచారణ జరిగింది. తమ వాదనలను జగన్, రఘురామ లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. అయితే, తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడంలేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ పై బయటున్నారు. అయితే జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి జగన్ మేళ్లు చేశారని, సాక్ష్యులను బెదిరించేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ వివరించారు. జగన్ బెయిల్ రద్దుకు ఈ కారణాలు సరిపోతాయన్నారు. ముఖ్యంగా, జగన్ కు బెయిల్ ఇవ్వడం వల్ల బాధితులుగా మారినవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు.


More Telugu News