ఎమ్మెల్యే ఆర్కే ఇంట్లో సోదాలు జరిపితే.. అత్యాచారం చేసిన వారి సమాచారం తెలుస్తుంది: అనిత

  • సీతానగరంలో దళిత యువతిపై జరిగిన అత్యాచారం కేసులో పురోగతి లేదు
  • నిందితుల వెనుక ఆర్కే, వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు
  • ఒక్క మహిళకు కూడా జగన్ న్యాయం చేయలేదు
సీతానగరంలో దళిత యువతిపై జరిగిన అత్యాచారం కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని... దీనికి కారణం అత్యాచారానికి పాల్పడిన వారు వైసీపీకి చెందినవారు కావడమేనని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. నిందితులు వైసీపీకి చెందినవారు కావడం వల్లే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల మీద దాడి చేసిన వారి గుడ్లు పీకేలా సీఎం ఉండాలని గతంలో చెప్పిన జగన్... గత రెండేళ్లలో ఎంతమంది గుడ్లు పీకారని ప్రశ్నించారు.

సీతానగరం అత్యాచారం నిందితుల వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), వసంత కృష్ణప్రసాద్ ఉన్నారని అనిత ఆరోపించారు. ఆర్కే ఇంట్లో సోదాలు నిర్వహిస్తే నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుందని చెప్పారు. అత్యాచార ఘటన తన సొంత నియోజకవర్గంలోనే జరిగినా ఆర్కే ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.

దిశ యాప్ ద్వారా ఏదో జరిగిపోతోందని, మహిళలను ఉద్ధరిస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని అనిత ఎద్దేవా చేశారు. నేతిబీరలో నెయ్యి ఉండదని, జగన్ తెచ్చిన చట్టాల్లో నిబద్ధత ఉండదని అన్నారు. జగన్ రెండేళ్ల పాలనలో 520కి పైగా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మహిళకు కూడా జగన్ న్యాయం చేయలేదని విమర్శించారు. సీతానగరం అత్యాచారం కేసులో నిందితులను శిక్షించకపోతే మహిళలమంతా కలిసి జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పారు.


More Telugu News