రాష్ట్రంలో ‘డెల్టా ప్లస్’​ కేసులు లేవు: కోర్టుకు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ

  • డెల్టా కన్నా డేంజర్ అనేందుకు ఆధారాలు లేవు
  • థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం
  • అన్ని పడకలకూ ఆక్సిజన్ ఏర్పాట్లు
ఇప్పటిదాకా తెలంగాణలో డెల్టా ప్లస్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. డెల్టా కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనడానికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులకు సంబంధించి ఇవ్వాళ హైకోర్టులో విచారణ జరగనుంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, డెల్టా ప్లస్ కేసుల పరిస్థితి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపై కోర్టుకు వైద్యారోగ్య శాఖ నివేదిక సమర్పించింది. ఇటు విద్యాశాఖ, పోలీస్, జైళ్లు, శిశు సంక్షేమ శాఖలూ తమతమ నివేదికలను ఇచ్చాయి.

ఇప్పటిదాకా 1.14 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను జనానికి పంపిణీ చేశామని, 16.39 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారని శ్రీనివాసరావు తెలిపారు. 81.4 లక్షల మందికి మొదటి డోసు వేశామన్నారు. మరో 1.75 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉందని చెప్పారు. విద్యాసంస్థల్లో 1.4 లక్షల మందికి వ్యాక్సిన్లు అందాయన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 11 సెంటర్లలో టీకాలిస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, పాజిటివిటీ రేటు కేవలం 0.78 శాతంగానే ఉందని చెప్పారు. రోజూ 1.12 లక్షల టెస్టులు చేస్తున్నామన్నారు. మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని శ్రీనివాసరావు చెప్పారు. నెలలో అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ పడకలన్నింటికీ ఆక్సిజన్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

కరోనా టెస్టులు, చికిత్సల ధరలపై ఇప్పటికే జీవో జారీ చేశామని, ఆ నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపారు. ఇప్పటిదాకా 231 ఆసుపత్రులపై 594 ఫిర్యాదులు వచ్చాయని, బాధితులకు 82.64 లక్షల రూపాయలు ఇప్పించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆన్ లైన్ తరగతులకే అనుమతినిచ్చామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వివరించారు. ఆ మార్గదర్శకాలను ఆమె కోర్టుకు వెల్లడించారు. మాస్కులు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, గత నెల 20 నుంచి ఈ నెల 5వ తేదీ దాకా 87,890 కేసులను నమోదు చేసి రూ.52 కోట్ల జరిమానాను వసూలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా 1,244 మంది ఖైదీలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ చెప్పారు. ఇప్పటిదాకా 6,127 మందికి ఒక డోసు, 732 మందికి రెండు డోసుల టీకా వేశామన్నారు.


More Telugu News