మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించిన కలకత్తా హైకోర్టు

  • నందిగ్రామ్ ఫలితాలపై విచారణ
  • జడ్జిని తప్పించాలన్న మమత
  • బీజేపీతో సంబంధాలున్నాయని ఆక్షేపణ
  • వేరే బెంచ్ కు ఇవ్వాలని డిమాండ్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. నందిగ్రామ్ నియోజకవర్గ ఫలితాల కేసు విచారణ నుంచి జస్టిస్ కౌశిక్ చందాను తప్పించాలన్న ఆమె విజ్ఞప్తిపై మండిపడింది. నందిగ్రామ్ లో మమతపై బీజేపీ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని మమత ఆరోపిస్తూ, హైకోర్టుకు వెళ్లారు.

ఇవ్వాళ విచారణ సందర్భంగా మమత తరఫు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ.. జస్టిస్ కౌశిక్ చందా చాలా మంది బీజేపీ నేతలతో కనిపించారని, ఈ కేసు విచారణను వేరే ధర్మాసనానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కేసును విచారిస్తున్న జస్టిస్ కౌశిక్ చందా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. మమతకు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ.. కేసు నుంచి తనకు తానుగా తప్పుకొన్నారు.  

‘‘ఓ వ్యక్తి రాజకీయ పార్టీ దగ్గరకు వెళ్లినంత మాత్రాన సదరు వ్యక్తి ఆ పార్టీకే చెందిన వ్యక్తి అని అనుకోవడానికి లేదు. ఈ కేసు విషయంలో కూడా అంతే. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేవు. ఉద్దేశపూర్వకంగానే కేసు విచారణకు ముందే నాకు పార్టీలతో సంబంధాలు అంటగట్టి తీర్పును ప్రభావితం చేస్తారని చెబుతున్నారు. పిటిషనర్ అనుకున్నంత మాత్రాన న్యాయమూర్తులు పక్షపాత ధోరణి చూపిస్తారని అనుకోకూడదు’’ అని జస్టిస్ కౌశిక్ చందా అన్నారు.

జూన్ 18న కేసు విచారణకు వచ్చిన వెంటనే.. తృణమూల్ పార్టీ నేతలు, కార్యకర్తలు తాను బీజేపీతో ఉన్నానంటూ ఫొటోలు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి ముందు ఆయన.. బీజేపీ ప్రభుత్వంలో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు.


More Telugu News