నేటి సాయంత్రం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌.. కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటు

  • అన్ని ఏర్పాటు పూర్తి
  • కొత్త‌గా కేంద్ర సహకార మంత్రిత్వ‌ శాఖ ఏర్పాటు
  • దేశంలో అన్ని వ‌ర్గాల్లో సహకారాన్ని మ‌రింత‌ బలోపేతం చేసే ఉద్దేశం
  • సహకారంతో సమృద్ధి అనే విజ‌న్ ఏర్పాటు  
  • దీనిపై ఇప్ప‌టికే నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌ట‌న‌
ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుంది. మంత్రి వ‌ర్గంలో కొత్త‌గా కొంద‌రికి అవ‌కాశం క‌ల్పించ‌డం, కొంత మందిని సాగ‌నంప‌డం వంటివి జ‌రుగుతాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో నిన్న కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొత్తగా కేంద్ర సహకార మంత్రిత్వ‌ శాఖను ఏర్పాటు చేస్తోంది. దేశంలో అన్ని వ‌ర్గాల్లో సహకారాన్ని మ‌రింత‌ బలోపేతం చేసే ఉద్దేశంతో కొత్తగా ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నారు. సహకారంతో సమృద్ధి అనే విజ‌న్ తో ఈ మంత్రిత్వ శాఖ‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఇదో చారిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని అభివ‌ర్ణించాయి.  

దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఈ శాఖకు కొత్త మంత్రిని బుధవారం నియమించే అవకాశం ఉంది. దేశంలో స‌హ‌కార ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేసేందుకు ఈ కొత్త‌ మంత్రిత్వ శాఖ ద్వారా ప్ర‌త్యేకంగా ప‌రిపాల‌న‌, న్యాయ‌, విధాన‌ప‌ర విధులు జ‌రుగుతాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపాయి.

ఈ కొత్త‌ మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలో అట్ట‌డుగు వ‌ర్గాలకు కూడా సేవ‌లు అందుతాయ‌ని పేర్కొన్నాయి. ఇటువంటి స‌హ‌కార ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ అభివృద్ధి విధానం భార‌త దేశానికి త‌గ్గ పాల‌సీ అని, దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు బాధ్యతాయుత స్ఫూర్తితో పనిచేస్తార‌ని కేంద్ర వ‌ర్గాలు తెలిపాయి.

వారికి ల‌బ్ధి చేకూర్చే విధంగా ఈ కొత్త‌ మంత్రిత్వ శాఖ‌.. సహకార సంస్థల సులభతర వాణిజ్యంతో పాటు బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధి కోసం పనిచేస్తుందని పేర్కొన్నాయి. గ‌త‌ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామ‌న్ కూడా కొత్త మంత్రిత్వ శాఖ విష‌యంపై సూచ‌న ప్రాయంగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.  

బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధి కోసం త‌మ ప్ర‌భుత్వం నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ప్ర‌త్యేక ప‌రిపాల‌నా శాఖ‌ను తాను ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చనున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేస్తోన్న తొలిసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేడు సాయంత్రం జ‌ర‌గ‌నుంది. ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు అన్ని అంశాల‌పై స్ప‌ష్ట‌త రానుంది. కేంద్ర కేబినెట్‌లో కొత్త‌గా జ్యోతిరాధిత్య‌ సింధియా, శర్బానంద సోనోవాల్, ప‌శుప‌తి పరాస్, నారాయ‌ణ రాణె, వ‌రుణ్ గాంధీకి చోటు ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. వారు ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్నారు.


More Telugu News