హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • ఫీజు కట్టలేదని విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల నిలిపివేత
  • హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రుల ఫోరం
  • విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • ఫీజులకు, ఆన్ లైన్ క్లాసులకు ఎలా ముడివేస్తారన్న కోర్టు
హైదరాబాద్ పబ్లిక్ స్కూలు బేగంపేట, రామంతపూర్ బ్రాంచిల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రుల ఫోరం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. ఫీజులు చెల్లించలేదంటూ వందల మంది విద్యార్థులకు గత కొన్ని వారాలుగా ఆన్ లైన్ క్లాసులు బోధించడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు చెల్లించలేదని ఆన్ లైన్ క్లాసులకు ఎలా అనుమతించరని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ న్యాయవాదిని ప్రశ్నించింది. సదుద్దేశంతో ఏర్పాటైన సొసైటీలు కూడా కార్పొరేట్ సంస్థల్లా లాభాపేక్ష ప్రదర్శిస్తే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫీజులు చెల్లించలేదన్న కారణంతో ఆన్ లైన్ క్లాసులు నిలుపుదల చేయడం విద్యాహక్కును కాలరాయడమేనని పేర్కొంది.

కరోనా సంక్షోభ సమయంలో స్కూళ్ల యాజమాన్యాలు మానవతా దృక్పథం చూపాలని హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం హితవు పలికింది. ఇక, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ... ఈ విద్యాసంవత్సరంలో 10 శాతం ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, ఫీజు 10 వేలు తగ్గించామని కోర్టుకు విన్నవించారు.

దీనిపై స్పందించిన కోర్టు... విద్యార్థుల ఫీజుల వివరాలు సమర్పించాలని స్కూలు యాజమాన్యాన్ని ఆదేశించింది. ఫీజుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. కాగా, విచారణ సందర్భంగా... స్కూలు ఫీజులకు, ఆన్ లైన్ క్లాసులకు ముడివేయడం తగదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.


More Telugu News