మిజోరాం నూతన గవర్నర్ కంభంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

  • మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియామకం
  • కంభంపాటిపై పవన్ ప్రశంసల జల్లు
  • ప్రజాప్రతినిధిగా విశేష సేవలందించారని వెల్లడి
  • మిజోరాం అభివృద్ధికి కూడా కృషి చేస్తారని ఆకాంక్ష
విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరాం నూతన గవర్నర్ గా నియమితులవడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కంభంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా విద్యార్థులను తీర్చిదిద్ది, ప్రజాప్రతినిధిగా విశాఖ నగరాభివృద్ధికి విశేష సేవలు అందించిన కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా నియమితులవడం సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. హరిబాబుకు తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాలపై దృష్టి పెట్టారని పవన్ కొనియాడారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతగానో దోహదపడుతుందన్న విశ్వాసం ఉందని వెల్లడించారు.

ఇక, హర్యానా గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న బండారు దత్తాత్రేయకు కూడా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా జీవితంలో విశేష అనుభవం ఉన్న దత్తాత్రేయ ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి విలువైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఇకపై హర్యానా రాష్ట్ర అభివృద్ధిలోనూ తన వంతు పాత్ర పోషిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


More Telugu News